SRH vs RR: ఐపీఎల్ 2026 సీజన్లోనే అత్యంత విధ్వంసకర ఓపెనర్లు ఉన్న రాజస్థాన్ రాయల్స్ (RR), అలాగే లీగ్‌లోనే అత్యంత భీకరమైన టాప్-3 బ్యాటింగ్ లైనప్ కలిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) కాసేపట్లో చావో రేవో తేల్చుకునే ఎలిమినేటర్ మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల వ్యూహాలు అన్నీ వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్‌లను ఎలా కట్టడి చేయాలనే అంశం చుట్టూనే తిరుగుతున్నాయి.
RR ఓపెనర్లకు కమిన్స్ ప్లాన్:
ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీని కాస్తయినా ఇబ్బంది పెట్టి, అతడికి పరుగులు ఇవ్వకుండా కట్టడి చేసిన ఏకైక బౌలర్ మొహసిన్ ఖాన్ మాత్రమే. సన్‌రైజర్స్ ఇప్పుడు అదే ప్లాన్‌ను వాడుకోవాలని చూస్తోంది.
* సూర్యవంశీకి చెక్: ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్, ఈషాన్ మలింగ ఇద్దరూ మంచి హైట్ ఉన్న బౌలర్లు. వీరు పిచ్‌పైకి షార్ట్ పిచ్ బంతులు వేస్తూ కట్టర్లతో ఇబ్బంది పెట్టగలరు. సూర్యవంశీకి షార్ట్ బాల్‌ను యాంగిల్‌గా బయటకు విసిరితే, అతడు పుల్ లేదా హుక్ షాట్ ఆడటానికి ప్రయత్నించి వికెట్ పారేసుకోవచ్చు.. ఎందుకంటే ఇప్పటి వరకు అతడు అప్పర్-కట్ లేదా ర్యాంప్ షాట్లు ఆడే ప్రయత్నం పెద్దగా చేయలేదు.
* జైస్వాల్‌ను ఆపే లైన్: జైస్వాల్ విషయంలో బంతిని మరింత స్ట్రెయిట్‌గా ఉంచుతూ షార్ట్ లెంగ్త్‌ను టార్గెట్ చేయడమే అత్యుత్తమ మార్గం. జైపూర్‌లో మలింగ, హైదరాబాద్‌లో సాకిబ్ హుస్సేన్ అతన్ని ఇలాగే అవుట్ చేశారు. న్యూ చండీగఢ్‌లోని పెద్ద స్క్వేర్ బౌండరీలు ఈ తరహా బౌలింగ్‌కు బాగా సహకరిస్తాయి.
ఆర్చర్ రాణిస్తేనే రాజస్థాన్‌కు ఛాన్స్:
సన్‌రైజర్స్ విధ్వంసకర ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలను కట్టడి చేయాలంటే రాజస్థాన్ రాయల్స్‌కు జోఫ్రా ఆర్చర్ తన బెస్ట్ ఫామ్‌లో ఉండటం చాలా అవసరం. వీరిద్దరూ ఆర్చర్ బౌలింగ్‌లో వేగంగా పరుగులు రాబట్టినప్పటికీ.. కేవలం 68 బంతుల్లో 4 సార్లు ఆర్చర్‌కు వికెట్లు సమర్పించుకున్నారు. ఇందులో మొదటి లీగ్ మ్యాచ్‌లో అభిషేక్, రివర్స్ ఫిక్చర్‌లో హెడ్ వికెట్లు ఉన్నాయి.
* జోఫ్రా ఆర్చర్ వ్యూహం: ఓవర్ ద వికెట్ వచ్చి, లెగ్ స్టంప్ వెలుపల ఉండే బ్లైండ్ స్పాట్లో గుడ్ లెంగ్త్ లేదా జస్ట్ షార్ట్ లెంగ్త్‌లో బంతిని పిచ్ చేసి, సహజసిద్ధంగా ఆఫ్ వైపు స్వింగ్ అయ్యేలా చేయడం ఆర్చర్ స్టైల్.. అతడు డేంజర్ కాబట్టి, సన్‌రైజర్స్ అతని మొదటి ఓవర్‌ను జాగ్రత్తగా ఆడి ముగించాలని చూస్తుంది.. ఒకవేళ ఆర్చర్ వికెట్ తీయకుండా టైట్‌గా బౌలింగ్ చేస్తే, రాయల్స్ వెంటనే డొనొవాన్ ఫెరీరాతో ఒక ఓవర్ వేయించే సాహసం చేసే అవకాశం ఉంది.
యష్ రాజ్ పుంజా స్పిన్ మాయాజాలం:
ఈ ఐపీఎల్ 2026 సీజన్లో ఇరు జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ రవీంద్ర జడేజా కేవలం ఒకే ఒక్క ఓవర్ బౌలింగ్ చేశాడు. దానికి కారణం ఎస్ఆర్హెచ్ టాప్-3 లోని లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు క్రీజులో పాతుకుపోవడమే. లెగ్‌స్పిన్నర్ రవి బిష్ణోయ్ కూడా రెండు మ్యాచ్‌లలో కలిపి కేవలం 4 ఓవర్లే వేయగలిగాడు. ఈ పరిస్థితుల్లో 8 వికెట్లు తీసి కేవలం 8.79 ఎకానమీతో రాణిస్తున్న యువ స్పిన్నర్ యశ్ రాజ్ పుంజా ఈ మ్యాచ్‌లో కీ ప్లేయర్ కానున్నాడు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లపై ఇతని ఎకానమీ కేవలం 8.1 మాత్రమే కావడం విశేషం.
* క్లాసెన్ ప్లాన్: స్పిన్‌ను ఊచకోత కోసే హెన్రిచ్ క్లాసెన్‌ను ఆపడం పుంజాకు పెద్ద సవాలే. బంతిని నెమ్మదిగా వేస్తూ, టర్న్ చేయగలిగితే క్లాసెన్‌ను కట్టడి చేయవచ్చు. గత రెండేళ్లలో క్లాసెన్‌పై మంచి ఎకానమీ ఉన్న ఏకైక లెగ్‌స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ మాత్రమే. పుంజా కూడా క్లాసెన్ ముందు కాస్త ధైర్యంగా లూప్ ఇవ్వాల్సి ఉంటుంది. మిడిల్ ఓవర్లలో క్లాసెన్‌పై నాండ్రే బర్గర్‌ను, క్రీజులో ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ ఉంటే ఫెరీరాను వాడుకునే అవకాశం కనిపిస్తుంది.
పరాగ్ వర్సెస్ శివాంగ్:
సన్‌రైజర్స్ బౌలర్లు ఎప్పటిలాగే బంతిని రివర్స్ స్వింగ్ చేయాలని చూస్తారు. కానీ న్యూ చండీగఢ్ పిచ్ హైదరాబాద్ అంత డ్రైగా ఉండకపోయినా.. ఓపెనర్లు అవుట్ అయ్యాక రాజస్థాన్ మిడిల్ ఆర్డర్‌ను కట్టడి చేయడానికి ఎస్ఆర్హెచ్ బౌలర్లు స్లో కట్టర్లను ఎక్కువగా నమ్ముకోనున్నారు. ముఖ్యంగా ధ్రువ్ జురెల్, ఫెరీరా, దాసున్ షనక, షిమ్రాన్ హెట్‌మైర్ వంటి హిట్టర్లను స్లో కట్టర్లతో ఇబ్బంది పెట్టవచ్చు.
* రియాన్ పరాగ్‌తో డేంజర్: ఈ స్లో బాల్స్ వ్యూహం రియాన్ పరాగ్ దగ్గర పారకపోవచ్చు.. ఎందుకంటే పరాగ్ స్లో బాల్స్‌ను చాలా త్వరగా పిక్ చేసి బౌండరీలకు తరలిస్తాడు. మిడిల్ ఓవర్లలో ఆర్ఆర్ ఇన్నింగ్స్‌కు అతనే అసలైన మజా..
* కీలక సమరం: గత రెండు ఐపీఎల్ సీజన్లలో లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్ బౌలింగ్‌లో పరాగ్ 29 బంతుల్లో 39 రన్స్ చేసి ఒకే ఒక్కసారి అవుట్ అయ్యాడు. ఇప్పటి వరకు అతడు శివాంగ్ కుమార్ బౌలింగ్‌ను ఫేస్ చేయలేదు. కాబట్టి, పరాగ్‌ను లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్నర్ శివాంగ్ బౌలింగ్‌లో భారీ షాట్లు ఆడేలా ఒత్తిడి తీసుకురావడం ఎస్ఆర్హెచ్ ప్రధాన వ్యూహం కానుంది.
